పోలవరం పనులకు.. ఇదే సమయం
వర్షాలు తగ్గడంతో వేగం పెంచాలన్న సీఎం చంద్రబాబు
ప్రాజెక్ట్ పురోగతిపై వర్చువల్ ఇన్స్పెక్షన్
విజయవాడ, అక్టోబర్ 31 : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకం పనులను మరింత వేగవంతం చేసేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులపై వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసిన ముఖ్యమంత్రి వర్షాలు తగ్గుముఖం పట్టినందున తవ్వకం పనులకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాన్ని, నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని సూచించారు.
పనులు జరుగుతున్న తీరును, ఎంతవరకు పురోగతి సాధించినదీ అధికారులు, ట్రాన్స్ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం రోజుకు సగటున 37,544 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్ వే, 30,242 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్ చానల్, 14,832 క్యూబిక్ మీటర్ల చొప్పున పవర్హౌస్ ఫౌండేషన్ తవ్వకం పనులు సాగుతున్నట్టు చెప్పారు. ఈవారం అదనంగా 75 వాల్వో ట్రక్కులు, 25 అశోక్ లేల్యాండ్ ట్రక్కులు, 7 భారీ ఎస్కవేటర్లు తీసుకువచ్చి వాటి సాయంతో పెద్దఎత్తున తవ్వకం పనులు చేపట్టినట్టు త్రివేణి సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వెల్లడించారు.
ఎప్పటికప్పుడు పనుల సమాచారాన్ని తనకు తెలపాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. నవంబర్లో చేపట్టాల్సిన స్పిల్ వే, స్పిల్ చానల్, పవర్హౌస్ ఫౌండేషన్ తవ్వకం పనుల లక్ష్యాన్ని నిర్దేశించారు. స్పిల్ వేకు సంబంధించి రోజుకు 43,444 క్యూబిక్ మీటర్ల చొప్పున మొత్తం 13,03,320 క్యూబిక్ మీటర్లు, అలాగే రోజుకు 1,84,000 క్యూబిక్ మీటర్ల చొప్పున మొత్తం 55,20,000 క్యూబిక్ మీటర్ల స్పిల్ చానల్ పనులు, రోజుకు 31,333 క్యూబిక్ మీటర్ల చొప్పున మొత్తం 9,40,000 క్యూబిక్ మీటర్ల మేర పవర్హౌస్ ఫౌండేషన్ తవ్వకం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వర్చువల్ ఇన్స్పెక్షన్లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారులు, ట్రాన్స్ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.